ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పడిన ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విద్య ప్రాముఖ్యత, ఓటు హక్కు వినియోగంపై పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్చించారు.
నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ద్వారా ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునే శక్తిని పొందారని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశంగా భారతదేశం నిలుస్తుందని, సరైన నాయకులను ఎన్నుకునే హక్కు ప్రతి ఓటరుకు ఉందని అన్నారు.
ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించాలని, ప్రజల హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికలలో ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని అన్నారు. విద్య కేవలం ఉద్యోగ సాధనకు మాత్రమే కాదని, సమాజంలోని అంశాలను, హక్కులను, చట్టాలను తెలుసుకోవడానికి కూడా దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థులు ఏకాగ్రత, పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
మహిళల సంక్షేమం, స్వావలంబన, పోషణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, దేశ భవిష్యత్తు యువతదేనని అన్నారు. భౌగోళికంగా, ఆర్థికంగా దేశం పటిష్టంగా ఉందని, భవిష్యత్తులో విద్య అత్యంత కీలకమని తెలిపారు. అక్షరాస్యతలో మంచిర్యాల జిల్లాను ముందంజలో ఉంచాలని, జిల్లా ప్రజల సంక్షేమం కోసం అధికార యంత్రాంగం సమన్వయంతో కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.












