మక్తల్, 2026-08-30
రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. మక్తల్ మండలం జౌలాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ సర్పంచ్ మహాదేవమ్మ బాలకిష్టయ్య, మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, మనలో మనం గొడవపడితే గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుందని, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. మక్తల్ మండలం జౌలాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ సర్పంచ్ మహాదేవమ్మ బాలకిష్టయ్య, మంత్రి వాకిటి శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ప్రతి గ్రామంలో సంక్షేమ ఫలాలు
సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి బూత్‌లో, ప్రతి గ్రామంలో కనిపిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో పేదలకు ఆశ చూపించారే తప్ప, ఒక్క పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు. ప్రస్తుతం ప్రజల్లో అవగాహన పెరిగిందని, తమ గ్రామాలను తామే అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో వస్తోందని అన్నారు.
284 బూత్‌లలో ఇందిరమ్మ ఇళ్లు
మక్తల్ నియోజకవర్గంలోని 284 బూత్‌లలో ప్రతి బూత్‌కు 10 నుంచి 12 ఇందిరమ్మ ఇళ్లు ఎలాంటి అవినీతికి తావులేకుండా మంజూరు చేస్తున్నామని మంత్రి తెలిపారు. సుమారు 276 కోట్లతో 5,500 ఇందిరమ్మ ఇళ్లు మక్తల్ నియోజకవర్గానికి మంజూరు కావడం శుభపరిణామమన్నారు. అలాగే నియోజకవర్గంలో 68 వేల రేషన్ కార్డులు మంజూరు చేసి, ప్రతి పేద కుటుంబానికి నెలకు 6 కిలోల సన్నబియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.
నమ్మకంతో గెలిపించిన ప్రజలకు న్యాయం చేస్తాను
మక్తల్ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి శ్రీహరి కోరారు. పదవులు శాశ్వతం కావని, తాము చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సేవలు మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు. నమ్మకంతో తనను గెలిపించిన మక్తల్ నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేసే బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి చేరేలా పనిచేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.









