మంచిర్యాల నియోజకవర్గాన్ని విద్య, వైద్య రంగాలలో ఒక ప్రధాన కేంద్రంగా (హబ్) మార్చే ప్రణాళికలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రకటించారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ బస్టాండ్, శ్రీ విశ్వనాథ ఆలయం పునర్నిర్మాణ నమూనాలను ప్రదర్శించారు. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మాఫీపై సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు.
మంచిర్యాల నియోజకవర్గాన్ని విద్య, వైద్య రంగాలలో హబ్ గా మారుస్తామని మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం కాలేజ్ రోడ్ లోని పద్మనాయక ఏసీ ఫంక్షన్ హాల్ లో ఆర్టీసీ బస్టాండ్ మరియు శ్రీ విశ్వనాథ ఆలయం పునర్నిర్మాణ నమూనాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పుర ప్రముఖుల వీక్షణం కోసం ప్రదర్శించారు.
ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, ఆర్టీసీ డిపోను పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తామని తెలిపారు. సుమారు రూ. 30 కోట్లతో అన్ని హంగులతో బస్టాండ్ నిర్మిస్తామని చెప్పారు. ప్రస్తుతం తొమ్మిది ఉన్న ప్లాట్‌ఫామ్‌లను నవీకరణలో భాగంగా 18కి పెంచనున్నట్లు తెలిపారు. విశ్రాంతి గదులు, మినీ థియేటర్, షాపింగ్ మాల్ వంటి సౌకర్యాలను ప్రయాణికులకు కల్పించనున్నామని చెప్పారు.
విశ్వనాథ ఆలయం అభివృద్ధి
పురాతన శ్రీ విశ్వనాథ ఆలయాన్ని పునర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా దేవాదాయ శాఖ వాస్తుశిల్పి, స్థపతి సూచనల మేరకు ఆలయ నిర్మాణం జరుగుతుందన్నారు. పుష్కరాల లోపు శివుడి ఆలయాన్ని పూర్తి చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మాఫీ
సింగరేణిలో కార్మికులకు ఆదాయపు పన్ను మాఫీ చేయాలన్న తన విన్నపాన్ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదాయపు పన్నును యాజమాన్యం ఎలా భరిస్తుందో, అదే విధంగా కార్మికులకు కూడా వర్తింపచేయాలని కోరిన మేరకు ఆమోదం లభించిందని తెలిపారు. మెడికల్ బోర్డును కొత్తగూడెంలో కాకుండా ఏరియాల వారీగా ఏర్పాటు చేసి, అదే రోజు ఫలితాలను విడుదల చేస్తే అవినీతికి ఆస్కారం ఉండదని అన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ, మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, మంచిర్యాల జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల, మార్కెట్ కమిటీ చైర్మన్లు రామగిరి బానేష్, అక్కల వెంకటేశ్వర్లు, మంచిర్యాల జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు పూదరి తిరుపతి, చాంబర్ ఆఫ్ కామర్స్ గుండ సుధాకర్, మండల అధ్యక్షులు సర్పంచ్ నలిమెల రాజు, పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, జిల్లా ఆర్జీపీఆర్ఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, సింగిల్ విండో చైర్మన్లు నాగభూషణం, ముత్యాల శ్రీనివాస్, దేవేందర్ రెడ్డి, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, సింగిల్ విండో డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












