తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని, పోరాట వీరుల త్యాగాలను భావితరాలకు అందించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రామ కృష్ణ పూర్ లో ఏఐటీయూసీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా రామ కృష్ణ పూర్ లోని సూపర్ బజార్ లో ఏఐటీయూసీ నూతన కార్యాలయాన్ని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యూనియన్ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాలకులు విస్మరించడం అన్యాయమని, ఆ మహత్తర పోరాట చరిత్రను భావితరాలకు అందించేలా పాఠ్యాంశాల్లో చేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా మందమర్రి బస్‌స్టాండ్‌లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలనకు, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా వేలాది మంది రైతులు, కూలీలు, మహిళలు, సామాన్య ప్రజలు సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో ఒక మహత్తర అధ్యాయమని అన్నారు. రైతులకు భూమి, వెట్టిచాకిరీ నిర్మూలన, సామాజిక న్యాయం కోసం కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన ఈ పోరాటంలో అనేక మంది ప్రాణత్యాగాలు చేశారని తెలిపారు. అలాంటి చారిత్రక పోరాటాన్ని నేటి తరానికి తెలియకుండా చేయడం చరిత్రను వక్రీకరించడమేనని అన్నారు.
మాది చరిత్రను మా చరిత్ర అంటూ బీజేపీ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర ఏమిటో, ఆ పోరాటంలో పోరాడిన తమ వీరులు ఎవరో తెలంగాణ ప్రజలకు బీజేపీ నాయకులు స్పష్టంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని, రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్పకాయల లింగయ్య, బీమానాడుని సుదర్శన్, మిట్ట పెల్లి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు మామిడి గోపి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు అక్బర్ అలీ, మందమర్రి బ్రాంచి కార్యదర్శి సేలంద్ర సత్యనారాయణ, ఏఐటీయూసీ నాయకులు రమణ హరి, మండల్ శ్రీనివాస్, కౌన్సిలర్లు కౌడగాని సాంబయ్య, మద్దెల శంకర్, మాదాసు శంకర్, షాకీర్, గజ్జి రమేష్ తదితరులు పాల్గొన్నారు.












