తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాలలో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రోటోకాల్, ప్రజా సంబంధాలు) హర్కర వేణుగోపాలరావు మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం, అభివృద్ధి కొరకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డి.సి.పి. ఎ. భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య లతో కలిసి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు.
అనంతరం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జరిగిన వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్, రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య లతో కలిసి పాల్గొని, పోలీసు గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూల సమర్పణ చేశారు.
ఈ సందర్భంగా అందించిన ప్రగతి సందేశంలో, ప్రభుత్వం రైతులు, మహిళల సంక్షేమాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, విద్య, వైద్య రంగాల బలోపేతానికి కృషి చేస్తూ ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సౌకర్యం కొరకు సకల సదుపాయాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. అనంతరం దివ్యాంగులకు మంజూరైన సహాయ పరికరాలను అందజేశారు.








