మంచేరియల్, 30-06-2026
మంచిర్యాల సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో మంచిర్యాల షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, మహిళలు, విద్యార్థినుల భద్రత, ఆత్మవిశ్వాసం, గౌరవాన్ని పరిరక్షించడమే షీ టీమ్ లక్ష్యమని తెలిపారు. వేధింపులను సహించొద్దని, వెంటనే షీ టీమ్‌ను ఆశ్రయించాలని సూచించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్లో, మంచిర్యాల సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో మంచిర్యాల షీ టీమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. షీ టీమ్ ఎస్ఐ ఉషారాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
మహిళలు, విద్యార్థినుల భద్రత, ఆత్మవిశ్వాసం, గౌరవాన్ని పరిరక్షించడమే షీ టీమ్ ప్రధాన లక్ష్యమని డీసీపీ ఏ. భాస్కర్ తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటే భయపడాల్సిన అవసరం లేదని, కేసు నమోదు చేస్తే భవిష్యత్తు దెబ్బతింటుందనే అపోహలను విడిచిపెట్టాలని సూచించారు. తమకు ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా షీ టీమ్ దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఫిర్యాదు అందిన వెంటనే షీ టీమ్ సభ్యులు బాధితురాలిని గోప్యంగా సంప్రదించి, సమస్యను తెలుసుకుని, విచారణ నిర్వహించి, తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని, ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. సామాజిక మాధ్యమాలు, ఫోన్ కాల్స్, సందేశాలు లేదా ప్రత్యక్షంగా ఎలాంటి వేధింపులు ఎదురైనా వాటిని సహించకుండా వెంటనే షీ టీమ్‌ను సంప్రదించాలని సూచించారు.
"పోనీలే" అనే భావనతో వేధింపులను భరిస్తే అవి మరింత పెరిగే అవకాశం ఉంటుందని, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనంగా ఉండవద్దని విద్యార్థినులకు సూచించారు. విద్యాసంస్థలు, వసతి గృహాలు, నివాస ప్రాంతాలు, ఉద్యోగ ప్రదేశాలు లేదా ప్రయాణ సమయంలో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైనా షీ టీమ్ సహాయం తీసుకోవాలని, మహిళల భద్రత కోసం షీ టీమ్ 24 గంటలూ పనిచేసే ప్రత్యేక పోలీసు విభాగమని తెలిపారు.
ప్రతి విద్యార్థిని తన సమస్యను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా షీ టీమ్‌తో వెంటనే పంచుకోవాలని, సమస్యలను దాచిపెట్టకుండా ధైర్యంగా ముందుకు వస్తే పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని పేర్కొన్నారు. జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే అవసరమైనప్పుడు ధైర్యంగా "నో" (No) చెప్పడం నేర్చుకోవాలని డీసీపీ సూచించారు. ప్రతి విషయానికీ "ఎస్" (Yes) చెప్పడం కంటే, తమకు ఇష్టం లేని, భవిష్యత్తుకు హాని కలిగించే విషయాలను ధైర్యంగా తిరస్కరించే వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలని అన్నారు.
పిల్లలకు చిన్నప్పటి నుంచే "నో" చెప్పే ధైర్యాన్ని పెంపొందించాలని, జీవితంలో అనేక సమస్యలకు మూల కారణం ఇష్టం లేకపోయినా తిరస్కరించలేకపోవడమేనని వివరించారు. ఇతరులను చూసి చదువులు లేదా వృత్తులను ఎంచుకోవడం కంటే, తమ ఆసక్తులు, ప్రతిభ, సామర్థ్యాలను గుర్తించి వాటికి అనుగుణంగా ముందుకు సాగాలని సూచించారు. ప్రతి విద్యార్థిలో ప్రత్యేక ప్రతిభ ఉంటుందని, ఆ ప్రతిభను గుర్తించి అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు.












