గంజాయి, మత్తు పదార్థాల రహిత తెలంగాణ నిర్మాణంలో విద్యార్థుల క్రియాశీల భాగస్వామ్యం అవసరమని, విద్యార్థులు తమ విద్య, క్రమశిక్షణ, లక్ష్య సాధనపై దృష్టి సారించాలని పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖనిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, కాకతీయ జూనియర్ కళాశాల, కృష్ణవేణి జూనియర్ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులకు గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, విద్యార్థులు మాదకద్రవ్యాలు, సోషల్ మీడియా వ్యసనాలు మరియు ఇతర అనారోగ్యకర అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. చిన్నపాటి ఆసక్తి లేదా కుతూహలం కారణంగా వ్యసనాలకు లోనైతే భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విద్యార్థులు విద్యపై దృష్టి సారించి తమ నైపుణ్యాలను పెంపొందించుకొని ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు.
ఇంటర్మీడియట్ అనంతరం యువతకు అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉంటాయని, వాటిని సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షిస్తూ విద్యను అందిస్తున్నారని, వారి ఆశయాలను నెరవేర్చే విధంగా విద్యార్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. విద్యార్థులు సెల్ఫోన్లు, సోషల్ మీడియాను అవసరమైన మేరకే వినియోగించాలని, అధికంగా వినియోగించడం వల్ల చదువుల నుంచి దృష్టి మరలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.
డ్రగ్స్ మాదిరిగానే సెల్‌ఫోన్, సోషల్ మీడియా వ్యసనాలు కూడా విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు. సోషల్ మీడియా రీల్స్, అనవసర చాటింగ్ వంటి వాటిపై సమయాన్ని వృథా చేయకుండా విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉన్నత లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండటమే కాకుండా, మాదకద్రవ్యాల బారిన పడిన స్నేహితులు, పరిచయస్తులు లేదా పొరుగువారి గురించి పోలీసులకు సమాచారం అందించడం కూడా ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగం లేదా అక్రమ రవాణా గురించి సమాచారం తెలిసిన వెంటనే 100 లేదా 1908 హెల్ప్‌లైన్ నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.












