మంచిర్యాల జిల్లా గుడిపేటలోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాల (బాలుర)లో విద్యార్థులకు డ్రగ్స్ దుష్ప్రభావాలు, మహిళా భద్రత, షీ టీమ్ కార్యకలాపాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చట్టాలు, సైబర్ నేరాలపై కూడా వివరించారు.
రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలను, జిల్లాలో షీ టీమ్ ప్రాముఖ్యత, విధుల గురించి షీ టీమ్ సభ్యులు వివరించారు.
మానవ అక్రమ రవాణా, ఫోక్సో చట్టాలు, బాల్య వివాహాలు, ఈవ్ టీజింగ్, T-SAFE అప్లికేషన్, POSH యాక్ట్, సైబర్ క్రైమ్స్, హెల్ప్‌లైన్ నంబర్లు 1930, 100 వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
సమాజంలో జరుగుతున్న నేరాలు, వాటి నుండి రక్షణ, మహిళలు, పిల్లల భద్రతకు ఉన్న చట్టాల గురించి తెలియజేశారు. సోషల్ మీడియా వల్ల కలిగే నష్టాలు, లాభాల గురించి కూడా వివరించారు.
ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని షీ టీమ్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.












