వేదిక (ప్రజావార్త) నవంబర్ 26
భారత రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక ఎల్కతుర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేదిక మండల అధ్యక్షుడు గడ్డం సంజీవ్ కుమార్ మాట్లాడుతూ, రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
భారత రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక ఎల్కతుర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో, భారత రాజ్యాంగ 77వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, గురువారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేదిక మండల అధ్యక్షుడు న్యాయవాది గడ్డం సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా సంఘ్ పరివార్ శక్తులు మతోన్మాద శక్తులు రాజ్యాంగాన్ని మారుస్తామని బహిరంగ ప్రకటనలు చేస్తున్నాయని ఆయన అన్నారు. అసలు రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగంలో మార్పులు చేయడం వల్ల ప్రజల ప్రాథమిక హక్కులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచనను పాలకులు తక్షణమే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని ప్రజలు కాపాడినప్పుడే రాజ్యాంగం ప్రజలను కాపాడుతుందని ఆయన అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తూ, ప్రజల హక్కులకు భంగం కలిగించే విధంగా పాలక పక్షాలు ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నాయని ఆయన విమర్శించారు.
ప్రజాస్వామ్యవాదులు, ప్రజాసంఘాలు, మేధావులు ఏకమై రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలకు వివరించాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆయన అన్నారు. మతోన్మాద శక్తులు ప్రజలను రెచ్చగొట్టి, తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఆయన సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తమ హక్కులను, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ అనేది ఒక్క సంస్థకో, ఒక్క వ్యక్తికో పరిమితమైన బాధ్యత కాదని, దేశంలోని ప్రతి పౌరుడి బాధ్యత అని గడ్డం సంజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పార్లపల్లి పృథ్వీరాజ్, ఉపాధ్యక్షులు జూపాక శ్రీనివాస్, పాటి భగవాన్ గౌడ్, బొంకూరి కార్తీక్, గౌరవ సలహాదారులు చదిరం నాగేష్, సీనియర్ జర్నలిస్ట్ సాతూరి చంద్రమౌళి, జూపాక జడ్సన్, సామాజికవేత్త కట్కూరి రాజేందర్, రేణిగుంట సాంబయ్య, అడ్డూరి అనిల్ కుమార్, శనగరపు వెంకటేష్, బొంకూరి రాజీవ్ గాంధీ, మహమ్మద్ అక్బర్, డాక్టర్ బుల్లెపోగు రమేష్ బాబు, అల్లకొండ బాలస్వామి, చిలుముల వినోద్ కుమార్, అడ్డూరి నవీన్, చిలుముల ప్రమోద్, అంబాల సుమన్ తదితరులు పాల్గొన్నారు.







