అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ఆదేశాల మేరకు, 'సంఘటన్ సృజన్ అభియాన్' కార్యక్రమాన్ని పురస్కరించుకుని, క్యాతనపల్లి మునిసిపాలిటీ – రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వొడ్నాల శ్రీనివాస్ అధికారికంగా ప్రకటించారు. ఈ నియామకం చెన్నూరు శాసన సభ్యులు, రాష్ట్ర మంత్రి డా. శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి మరియు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ గడ్డం వంశీకృష్ణల మార్గదర్శకత్వంలో జరిగింది.
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వొడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్ర్య పోరాటం నుండి ప్రజల హక్కుల పరిరక్షణ వరకు నిరంతరం ప్రజల పక్షాన నిలిచిందని తెలిపారు. మహానేతల ఆశయాలతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం, లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తోందని ఆయన అన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, మహాలక్ష్మి పథకం, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్ల పథకం, యువత ఉపాధి అవకాశాల కల్పన, పేదలకు నాణ్యమైన వైద్యం, విద్య వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని శ్రీనివాస్ వివరించారు. క్యాతనపల్లి మునిసిపాలిటీ చెన్నూరు శాసనసభ్యుల నేతృత్వంలో అభివృద్ధి పథంలో నడుస్తోందని ఆయన తెలిపారు.
'సంఘటన్ సృజన్ అభియాన్' ద్వారా పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేయడం, యువతకు అవకాశాలు కల్పించడం, సామాజిక వర్గాల సమన్వయంతో పార్టీ నిర్మాణాన్ని విస్తరించడం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నూతన కార్యవర్గంలో బీసీ, ఎస్సీ, కార్మిక, యువజన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రజలకు అండగా నిలుస్తూ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్లే బాధ్యతను ప్రతి నాయకుడు, కార్యకర్త సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.











