కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని, అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ వంశీ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ వంశీ మాట్లాడుతూ, బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయిస్తూ, తెలంగాణకు రావాల్సిన నిధుల్లో కోత విధిస్తోందని విమర్శించారు. దేశానికి అత్యధిక పన్నులు చెల్లిస్తున్నప్పటికీ, తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు.
డి లిమిటేషన్ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తామని, తెలంగాణకు కేటాయించాల్సిన సెమీ కండక్టర్ యూనిట్ ను ఆంధ్రప్రదేశ్ కు తరలించారని ఎంపీ ఆరోపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వివాదాస్పద వ్యక్తులకు టికెట్లు ఇచ్చి బీజేపీ గెలుచుకుందని ఆయన విమర్శించారు.
రామగుండం యూరియా ఉత్పత్తిలో నిర్లక్ష్యం వహిస్తూ, యూరియా కొరతను సృష్టిస్తున్నారని వంశీ ఆరోపించారు. మంచిర్యాల జిల్లాకు సంబంధించిన ధాన్యం కొనుగోలులో పెద్దపల్లి కలెక్టర్ వివక్ష చూపుతున్నారని, అధిక సంఖ్యలో దళిత రైతులు ఉన్నప్పటికీ వారిని చిన్నచూపు చూస్తున్నారని ఆయన విమర్శించారు. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని వంశీ పేర్కొన్నారు.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని ఎంపీ వంశీ స్పష్టం చేశారు. అధికారులు రాజకీయాలకు దూరంగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. పెద్దపల్లి జిల్లాకు కేటాయించిన ధాన్యం కొనుగోళ్లలో కలెక్టర్ నిర్లక్ష్యాన్ని ఆయన ఎత్తిచూపారు.







