లక్సెట్టిపేట పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా పోలీసులు సోమవారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 46 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో సర్కిల్ సిబ్బంది పాత బస్టాండ్, మహాలక్ష్మివాడ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, వాహన పత్రాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
కార్డన్ సెర్చ్ అనంతరం స్థానిక ప్రజలకు పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి, నేరాల నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించడం, వాహన పత్రాలు వెంట ఉంచుకోవడం తప్పనిసరిగా పాటించాలని, అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి రోడ్డుపైకి పంపవద్దని హెచ్చరించారు.
వేసవి సెలవుల సందర్భంగా ఊర్లకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విలువైన వస్తువులను ఇంట్లో వదిలివెళ్లవద్దని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.












