మంచేరియల్, జూలై 3, 2026
జిల్లాలో భూ సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, రెవెన్యూ గ్రామాల హద్దుల నిర్ధారణతో సమస్యల పరిష్కారానికి వెసులుబాటు కలుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామంలో జరిగిన సమగ్ర భూ సర్వే అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో భూ సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, రెవెన్యూ గ్రామాల హద్దుల నిర్ధారణతో సమస్యల పరిష్కారానికి వెసులుబాటు కలుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సమగ్ర భూ సర్వే అవగాహన సదస్సుకు మండల తహసిల్దార్ మల్లికార్జున్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్ లతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సంబంధిత దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రికార్డులను చూసి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రికార్డులు, మోకా, పట్టాదారుల వివరాలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొదటగా గ్రామంలోని భూములకు సంబంధించి హద్దులు నిర్ధారించడం జరుగుతుందని, తద్వారా గ్రామానికి సంబంధించిన భూమిపై స్పష్టత వస్తుందని, ప్రభుత్వ భూములు సైతం నిర్ధారణ అవుతాయని తెలిపారు.
పట్టా కలిగి ఉండి మోకాపై లేకపోవడం, మోకాపై ఉండి పట్టా కలిగి ఉండకపోవడం వంటి అంశాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూ సర్వే సమగ్రంగా నిర్వహించి మ్యాపింగ్ చేస్తామని, ఈ క్రమంలో భూ సమస్యలు తలెత్తినట్లయితే న్యాయపరమైన చర్యలకు సులభతరమవుతుందని, మ్యాపింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ చర్యలలో భాగంగా నిబంధనల ప్రకారం సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయడం జరుగుతుందని, న్యాయపరంగా రావలసిన భూమి అందుతుందని తెలిపారు. భూములలో కబ్జాదారుల జాబితా తయారు చేయడం జరుగుతుందని, పట్టా భూముల సర్వే అనంతరం రికార్డులను సరిచూసి సర్వే నెంబర్ల ప్రకారం హద్దుల నిర్ధారణ జరుగుతుందని, పట్టాలో ఒక సర్వే నెంబరు, మోకాలో మరో సర్వే నెంబరు వంటి అంశాలపై మ్యాపింగ్ ప్రకారం పకడ్బందీగా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మ్యాపింగ్ తయారు చేసిన తర్వాత మార్పులు కష్టతరమని, భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా ప్రస్తుతం మోకాలో వినియోగిస్తున్న రోడ్డు (దారిని) సైతం మ్యాపింగ్ లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. సర్వేయర్లు, ప్రజల సహకారంతో సమస్యల పరిష్కారం వేగవంతం అవుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి అదనపు గదులు, భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించి, పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. వంటశాల, తరగతి గదులను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని, నాణ్యమైన విద్య అందించే దిశగా ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.
అనంతరం కోటపల్లి మండల కేంద్రంలో కొనసాగుతున్న అమృత్ 2.0 పథకం పనులను మండల తహసిల్దార్ రాఘవేంద్ర, మండల పరిషత్ అభివృద్ధి అధికారి నాగేశ్వర్ రెడ్డి లతో కలిసి సందర్శించి, పనులు త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో కొనసాగుతున్న అదనపు గదులు, భోజనశాల పనులను పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న మెనూ, విద్య బోధన తీరును పరిశీలించారు.












