జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో నిర్వహించిన రోడ్డు భద్రతా సమావేశంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, బెల్లంపల్లి, జైపూర్ ఏసీపీలు, జాతీయ రహదారుల అధికారులు పాల్గొన్నారు. జాతీయ రహదారులపై ఆక్రమణలు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని, జాతీయ రహదారి-363పై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ గన్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. అవసరమైన ప్రాంతాలలో స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, రహదారులపై తగినంత వెలుతురు ఉండేలా లైటింగ్ సదుపాయాలను మెరుగుపరచాలని తెలిపారు. రహదారులపై పశువుల సంచారం వల్ల ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు గోశాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి, అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. రవాణా శాఖ అధికారులు ఓవర్‌లోడ్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై లైసెన్సుల సస్పెన్షన్ వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాల బస్సుల ఫిట్నెస్ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, ఫిట్నెస్ లేని వాహనాలను నడిపే వారిపై చర్యలు తీసుకోవాలని, ఇన్సూరెన్స్ లేకుండా తిరిగే వాహనాలపై జరిమానాలు విధించాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్‌పై పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. మున్సిపాలిటీల పరిధిలో భవనాల సెల్లార్లను పార్కింగ్ అవసరాలకే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా రహదారులపై వాహనాల పార్కింగ్‌ను నియంత్రించి ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలను తగ్గించాలని సూచించారు. రోడ్డు భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సంబంధిత శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.












