జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జరిగిన రహదారి భద్రత సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.
జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జరిగిన రహదారి భద్రత సమావేశానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో రహదారి ప్రమాదాలు తగ్గించేందుకు, నివారణకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు పటిష్టంగా అమలు చేయాలని, వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మున్సిపల్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు, ఇతర రోడ్డు భద్రత సూచికలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. మున్సిపల్ పరిధిలోని రోడ్లపై చెత్త, ఆటంకాలను వెంటనే తొలగించాలని, ట్రాఫిక్ పోలీసు విభాగం రోడ్లపై అనధికార వాహన నిలుపుదల, నిబంధనల ఉల్లంఘన పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. రోడ్లపై తక్కువ విజిబిలిటీ ఉన్న చోట్ల లైటింగ్ ఏర్పాటు చేయాలని, జాతీయ రహదారులపై రంబుల్ స్ట్రిప్స్, లైటింగ్, జాగ్రత్త సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, రహదారులపై వాహనాలు నిలపకుండా రహదారులు భవనాలు, పోలీసు శాఖల ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్లపై అదుపు తప్పిన, ఓవర్ లోడెడ్ వాహనాలు, పరిమితికి మించి వేగంగా వెళ్లే వాహనాలు, ఫిట్ నెస్ లేని స్కూల్ బస్సులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ట్రాఫిక్ పోలీసు అధికారులు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరి చేయడంలో కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలో రోడ్డు భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని, గ్రామీణ ప్రాంతాలలో, అంతర్గత రహదారులలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, జిల్లా వ్యాప్తంగా వేగ పరిమితి బోర్డులు, హెచ్చరిక బోర్డులు, జాగ్రత్త సూచికలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఓవర్ లోడింగ్, మితిమీరిన వేగం, డ్రంక్ అండ్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ లపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. రోడ్లపై సంచరించే పశువులను అందుబాటులో ఉన్న గోశాలకు తరలించాలని, నూతన గోశాల ఏర్పాటుకు భూమిని కేటాయించడం జరిగిందని, త్వరితగతిన పనులు చేపట్టి పూర్తి చేయాలని ఆయన సూచించారు. రహదారి ప్రమాదాలు, మరణాలు తగ్గించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆయన కోరారు. డి.సి.పి. మాట్లాడుతూ, జిల్లాలో 2026 సంవత్సరంలో ఇప్పటివరకు 429 ప్రమాదాలు జరిగాయని, ఈ ప్రమాదాలలో 95 మంది మృతి చెందారని తెలిపారు. జిల్లాలో ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. బెల్లంపల్లి కన్నాల ప్రాంతంలో, నస్పూర్ లోని కలెక్టరేట్ కమాన్ ప్రాంతంలో రంబల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
అనంతరం మాదకద్రవ్యాల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మాదక ద్రవ్య రహిత మంచిర్యాల జిల్లా సాధనలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు 63 కేసులు నమోదు చేయడం జరిగిందని, ఇందులో 133 మందిని అరెస్టు చేసి, 35 మందిని డ్రగ్ డి-అడిక్షన్ కేంద్రాలకు తరలించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని, జిల్లా మాధ్యమిక విద్యాధికారి ఆధ్వర్యంలో జూనియర్ కళాశాలలో అబ్నార్మల్ బిహేవియర్ ఉన్న విద్యార్థులను గుర్తించి సంబంధిత ఎస్ హెచ్ ఓ కు సమాచారం అందించాలని ఆయన సూచించారు. విద్యార్థులకు మాదకద్రవ్యాల నియంత్రణపై క్విజ్, డ్రాయింగ్ మొదలగు పోటీలను నిర్వహించాలని ఆయన సూచించారు. విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహించడం, పొగాకు సంబంధిత ఉత్పత్తులను అమ్మడం నిషేధించడం జరిగిందని, ఆ దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మెడికల్, ఐటిఐ, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలలో నిత్యం మాదక ద్రవ్యాల వినియోగంపై విద్యార్థులను గమనిస్తూ, మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. జిల్లాలోని మద్యం దుకాణాలు నిర్ణీత సమయానికి మూసివేసేలా చర్యలు తీసుకోవాలని, బెల్ట్ షాపులను నియంత్రించాలని ఆయన ఆదేశించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గంజాయి తదితర మొక్కల సాగు చేసే వారిని గుర్తించాలని ఆయన ఆదేశించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో మెడికల్ షాప్ లను నిత్యం పర్యవేక్షించాలని, సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులను విక్రయించే షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. డి అడిక్షన్ కేంద్రాలలో అవసరమైన కిట్లను అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు.












