మంచేరియల్, 2026-06-30
అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా చెన్నూరు పట్టణంలో 15 రోజుల పాటు ఉచిత యోగా శిక్షణ శిబిరం విజయవంతంగా పూర్తయింది. సత్వా ప్రకృతి వైద్యం, యోగ & ఆయుర్వేద చికిత్సాలయం, శివలింగాపూర్ మరియు రాజస్థానీ సమాజ్, చెన్నూరు సంయుక్తంగా ఈ శిబిరాన్ని నిర్వహించాయి. డాక్టర్ కె.ఎన్. సుకుమార్, డాక్టర్ పి. సమీరా రెడ్డి పోటు ఆధ్వర్యంలో శిక్షణ జరిగింది.
అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నూరు పట్టణంలోని మార్వాడీ భవన్లో నిర్వహించిన 15 రోజుల ఉచిత యోగ శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసింది.
సత్వా ప్రకృతి వైద్యం, యోగ & ఆయుర్వేద చికిత్సాలయం, శివలింగాపూర్ మరియు రాజస్థానీ సమాజ్, చెన్నూరు సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని గత 15 రోజులుగా నిర్వహించారు. శిబిర నిర్వాహకులు, యోగ మరియు ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ కె.ఎన్. సుకుమార్ మరియు డాక్టర్ పి. సమీరా రెడ్డి పోటు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఉదయం 6.00 గంటల నుండి 7.30 గంటల వరకు యోగ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.
శిబిరంలో ఆరోగ్యవంతమైన జీవనానికి అవసరమైన యోగాసనాలు, సూర్యనమస్కారాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి అంశాలతో పాటు మధుమేహం, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు, థైరాయిడ్ సమస్యలు, జీర్ణాశయ సంబంధిత వ్యాధులు, మహిళల ఆరోగ్య సమస్యలు తదితర దీర్ఘకాలిక రుగ్మతలకు అనుగుణంగా చేయాల్సిన యోగాభ్యాసాలపై సమగ్ర అవగాహన కల్పించారు.
అదేవిధంగా ఆరోగ్యకరమైన ఆహార నియమాలు, ఇంటి వైద్యం, ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం ద్వారా వ్యాధి నివారణ మరియు ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన పలు సూచనలు కూడా పాల్గొన్న వారికి వివరించారు.
ఈ శిబిరంలో చెన్నూరు పట్టణానికి చెందిన 100 మందికి పైగా ఆరోగ్యాభిలాషులు, యోగ సాధకులు, మహిళలు, పురుషులు పాల్గొని శిక్షణ పొందారు.
ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్వాడీ సమాజ్ అధ్యక్షులు శ్యాంసుందర్ లహోటీ, వెల్గటూర్ మండల తహసీల్దార్ (ఎంఆర్వో) శేఖర్, ఘనశ్యామ్ సేఠ్తో పాటు పట్టణ ప్రముఖులు, మహిళలు, పురుషులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా శిబిరంలో పాల్గొన్న సాధకులు, మార్వాడీ సమాజ్ ప్రతినిధులు శిబిర నిర్వాహకులు డాక్టర్ కె.ఎన్. సుకుమార్, డాక్టర్ పి. సమీరా రెడ్డి పోటు, డాక్టర్ మధుస్మిత & Dr Madhumitha లను ఘనంగా సన్మానించి, ఇలాంటి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని అభినందించారు.












