మంచేరియల్, జూలై 9, 2026
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ర్యాంకుల్లో మంచిర్యాల జిల్లా 360 స్కోర్ తో రాష్ట్రంలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ నివేదికను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులతో కలిసి గురువారం విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే జిల్లా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది.
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన పర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ర్యాంకులో మంచిర్యాల జిల్లా 360 స్కోర్ తో రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాశాఖ అధికారి పి.చంద్రయ్య, అధికారులతో కలిసి పర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2025-26 నివేదికను విడుదల చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2024-25 విద్యా సంవత్సరంలో 324 స్కోర్ తో జిల్లా 3వ స్థానంలో నిలువగా, అన్ని విభాగాలలో ప్రతిభను మెరుగుపరచుకొని ఈ సంవత్సరం 360 స్కోర్ తో 2వ స్థానంలో నిలిచిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం తన స్థానాన్ని మెరుగుపరచుకొని జాతీయస్థాయిలో 18వ స్థానంలో నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలలో మూత్రశాలలు లేని పాఠశాలలను గుర్తించి మౌలిక వసతులను కల్పించడంతో పాటు, అమ్మ ఆదర్శ పాఠశాల పనుల ద్వారా పాఠశాలలలో త్రాగునీరు, విద్యుత్, తరగతి గదులకు అవసరమైన మరమ్మత్తులు చేపట్టడం, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలకు అనుబంధంగా ఉన్న బాలికల వసతి గృహాలలో విద్యార్థులకు అదనంగా వసతి గదులు, భోజనశాల, వంటశాల, మూత్రశాలలు, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ లు నిర్మించడం, ఆర్ఓ వాటర్ ప్లాంట్లను ఏర్పరచడం, ఇంటర్మీడియట్ బ్లాక్ లను నిర్మించడం వంటి చర్యలతో పాఠశాలలలో మౌలిక వసతులు బలోపేతమై ఎక్కువ స్కోరు సాధించడం జరిగినదని తెలిపారు.
పాఠశాలలలో పర్యవేక్షణ మెరుగుపరిచేందుకు దాదాపు 50 మంది సభ్యులతో 8 తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి 485 పాఠశాలలను పూర్తి స్థాయిలో సమగ్రంగా తనిఖీ చేయడం జరిగిందని, డిజిటల్ విద్యను బలోపేతం చేయడం ద్వారా డిజిటల్ విద్యా విభాగంలో స్కోరు మెరుగైందని కలెక్టర్ వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారులు ఎం.భరత్ కుమార్, జంబోజు సత్తయ్య, కృష్ణమూర్తి, రాజ్ కుమార్ పాల్గొన్నారు.












