మంచేరియల్, 2026-07-18
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొందరు కాంగ్రెస్ నాయకులు తనను అడ్డుకునే ప్రయత్నం చేయడం బాధాకరమని ఎంపీ అన్నారు. రాజకీయ విభేదాలు పక్కనపెట్టి అభివృద్ధిపై అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ గడ్డం వంశీకృష్ణ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎంపీకి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో తమ తాత కాకా వెంకటస్వామి ఈ ట్రస్ట్‌ను స్థాపించారని గుర్తుచేశారు.
గూడెం జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులు బెంచీలు లేక ఇబ్బందులు పడుతున్న విషయం తనను బాధించిందని, త్వరలోనే ఈ పాఠశాలకు అవసరమైన బెంచీలను అందజేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకునే వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రతి విద్యార్థి బాగా చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఆకాంక్షించారు.
కార్యక్రమం అనంతరం ఎంపీ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ, గూడెం జడ్పీహెచ్ఎస్లో స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి వస్తుండగా కొందరు కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడం బాధాకరమని అన్నారు. రాజకీయాల్లో విభేదాలు సహజమే అయినప్పటికీ, ప్రజల అభివృద్ధి విషయంలో అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. గతంలో గూడెం ఆలయ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో కూడా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు. అయితే అలాంటి విషయాలను తాను పట్టించుకోనని, ప్రజల అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయడమే తన ఆకాంక్ష అని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు.












