మంచేరియల్, 2026-07-16
తెలుగు భాషను కేవలం పాఠ్యాంశంగా కాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా భావించి విద్యార్థులకు బోధించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య తెలుగు ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తెలుగు భాషా శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
తెలుగు భాషను కేవలం ఒక పాఠ్యాంశంగా కాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా భావించి విద్యార్థులకు బోధించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య తెలుగు భాష ఉపాధ్యాయులకు సూచించారు.
గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు భాషా శిక్షణ కార్యక్రమానికి హాజరైన ఆయన, ఈ సందర్భంగా మాట్లాడారు. శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న వినూత్న బోధనా పద్ధతులను పాఠశాల స్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థులలో తెలుగు భాషపై ఆసక్తి, అభిరుచిని పెంపొందించాలని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితులలో ఇతర భాషల ప్రభావం కారణంగా విద్యార్థులకు తెలుగు భాషను సమర్థవంతంగా బోధించడం కొంత సవాలుగా మారిందని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు తెలుగు ఉపాధ్యాయులు సృజనాత్మక బోధనా విధానాలను అవలంబించాలని పి.చంద్రయ్య సూచించారు. ముఖ్యంగా కథలు, కవితలు, పద్యాలు, నాటికలు వంటి సాహిత్య ప్రక్రియలను ఉపయోగించి విద్యార్థులలో భాషా నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో సమర్థవంతంగా వినియోగించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కోర్సు కో-ఆర్డినేటర్ జంబోజు సత్తయ్య, శిక్షణ కేంద్ర ఇన్చార్జి బోనగిరి శ్రీనివాస్, జిల్లా స్థాయి డి.ఆర్.పి.లు, తెలుగు భాష ఉపాధ్యాయులు పాల్గొన్నారు.












