మక్తల్ నియోజకవర్గంలో రూ.250 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి బుధవారం పరిశీలించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా మక్తల్‌లో 250 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు.
శరవేగంగా కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అత్యుత్తమ విద్యతో పాటు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఒకే ప్రాంగణంలో అందుబాటులో ఉండేలా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.
మక్తల్ నియోజకవర్గంలో విద్య, వైద్యం, రహదారులు, సాగునీరు, విద్యుత్ తదితర రంగాల్లో అభివృద్ధి పనులను వేగంగా చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ప్రతి గ్రామానికి, ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.












