పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి నియోజకవర్గానికి రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మంజూరు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు తెలిపారు. మండలం రాములపల్లి వద్ద రూ. 200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ చింతకుంట విజయరమణ రావు గారు మండలం రాములపల్లి వద్ద రూ. 200 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను సంబంధిత అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు గారు మాట్లాడుతూ.. కుల, మత బేధాలు లేకుండా అన్ని కులాలు, మతాలు ఒకే వేదికపై పెద్ద ఎత్తున విద్యాభ్యాసం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గానికి రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మంజూరు చేశారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తాను శాసనసభ్యుడిగా ఎన్నికైన రెండున్నర సంవత్సరాలలో పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ. 70 కోట్లు నిధులు మంజూరు చేసి, పాఠశాల భవనాలు, మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు నిర్మించడం జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వంలో 10 ఏళ్లు పరిపాలన చేసిన అప్పటి ఎమ్మెల్యే ప్రభుత్వ స్కూళ్లను ఏ మాత్రం పట్టించుకోకుండా తన ప్రైవేటు పాఠశాలలపైనే దృష్టి పెట్టారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు గారు విమర్శించారు.
ఈ సందర్భంగా మండలంలోని రామునిపల్లెలో రూ. 200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలను సోమవారం రోజున స్థానిక నాయకులతో కలిసి పరిశీలించడం జరిగిందని అన్నారు. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగా రామునిపల్లెలో ఇంటర్నేషనల్ స్కూల్కు దీటుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం జరుగుతుందని, 2560 మంది పిల్లలకు విద్య అందించడంతోపాటు హాస్టల్, ప్లే గ్రౌండ్, డైనింగ్ హాల్ నిర్మించడం జరుగుతుందని చెప్పారు.
ముఖ్యమంత్రి ఆలోచన మేరకు పేద, మధ్యతరగతి పిల్లలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వారికి టీపీఎఫ్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ లలో దేశంలోని 29 రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలోనే మిడ్ డే మీల్స్ తో పాటు అల్పాహారం కూడా గత రెండు మాసాల క్రితం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. టిఫిన్ తో పాటు మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగి జావా కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ విద్యార్థులకు హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం కూడా ప్రారంభించడం జరిగింది. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయిన ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు కాలేదని, మన రాష్ట్రంలోనే ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. ఈ రాష్ట్రంలోని విద్యార్థులకు మంచి విద్యతో పాటు పౌష్టికారమైన ఆహారం అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేలాది కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు.












