రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, మంచిర్యాల కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా పెంచేందుకు నాకాబంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ తెలిపారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని వాణిజ్య సంస్థలు, లాడ్జీలు, మార్కెట్ ప్రాంతాలు, బ్యాంకులు, గోల్డ్ షాపుల వద్ద పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
బ్యాంకులు, బంగారు దుకాణాలను లక్ష్యంగా చేసుకుని జరిగే చోరీలు, దోపిడీలు, దొంగతనాలను ముందుగానే అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు డీసీపీ తెలిపారు. బ్యాంకులకు వచ్చే ఖాతాదారుల దృష్టిని మళ్లించి నగదు, విలువైన వస్తువులను అపహరించే ముఠాలపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ముఖ్యమైన ప్రాంతాలు, రహదారులు, సరిహద్దుల్లో ఆర్మర్డ్ పోలీస్ సిబ్బంది, ప్రత్యేక బృందాల సహకారంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనదారులు తప్పనిసరిగా తమ వాహనాలకు సరైన నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాలని, నంబర్ ప్లేట్‌ను వంచడం, మార్చడం లేదా నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం చేయరాదని సూచించారు. నంబర్ ప్లేట్ లేని లేదా స్పష్టంగా గుర్తించలేని వాహనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తారని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనాలకు సరైన నంబర్ ప్లేట్‌తో పాటు అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే పోలీసుల తనిఖీల సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. మంచిర్యాల మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉన్నందున, నేరాలకు పాల్పడిన వ్యక్తులు సరిహద్దులు దాటి పారిపోయే అవకాశాలను అరికట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను మరింత పటిష్టం చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. పోలీసులు 24/7 అప్రమత్తంగా అందుబాటులో ఉంటారని, ఆర్మర్డ్ పోలీస్ బృందాలు కూడా అవసరమైన ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం నిర్వహిస్తున్న నాకాబంది పోలీసుల సన్నద్ధత, నేర నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే కార్యక్రమంలో భాగమని, కమిషనరేట్ పరిధిలోని ముఖ్యమైన ప్రాంతాలు, రహదారులు, సరిహద్దుల్లో ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని డీసీపీ తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ తమ వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను సక్రమంగా ఉంచుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు, ట్రాఫిక్ పోలీసులు, స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.












