వరి ధాన్యం నిల్వ గోదాముల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు.
జిల్లాలోని కాసిపేట, బెల్లంపల్లి మండలాల్లోని వరి ధాన్యం నిల్వ గోదాములను కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు సంక్షేమంలో భాగంగా చేపట్టిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, రైతులకు సకాలంలో నగదు చెల్లింపులు పూర్తి చేయాలని ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాలలో సేకరించిన ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం గోదాములలో నిల్వ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ప్రస్తుత గోదాముల సామర్థ్యం 61 వేల మెట్రిక్ టన్నులుగా ఉందని, ఈ సామర్థ్యాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, రవాణా వాహనాల కేటాయింపును మెరుగుపరిచి, ధాన్యం రవాణా, అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి అంతరాయాలు, హమాలీ సమస్యలు తలెత్తకుండా చూడాలని తెలిపారు.
అనంతరం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, భూభారతి రెవెన్యూ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను సమీక్షించారు. అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అధికారులు సమయపాలన పాటించాలని కూడా సూచించారు.











