రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. గురువారం హాజీపూర్ మండలం గుడిపేటలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి, కొనుగోలు తీరును, ప్రక్రియను నిశితంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ధాన్యం కొనుగోలును త్వరితగతిన పూర్తి చేసి, రైతులకు సకాలంలో నగదు చెల్లింపులు జరిగేలా చూడాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, జిల్లాలోని మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.
కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చే ధాన్యం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా, శుభ్రపరిచేలా రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన పేర్కొన్నారు. కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి అంతరాయాలు తలెత్తకుండా, హమాలీ సమస్యలు రాకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ సూచించారు.
కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ, రైతుల నుంచి ధాన్యం కొనుగోలును పారదర్శకంగా, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని సకాలంలో ఆరబెట్టి, కేటాయించిన రైస్ మిల్లులకు తరలించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు.











