రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించి, CMR (Custom Milled Rice) లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సంబంధిత రైస్ మిల్లుల నిర్వాహకులను ఆదేశించారు. సోమవారం జిల్లాలోని పలు రైస్ మిల్లులను, కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.
హాజీపూర్ మండలంలోని ఎస్.ఆర్.ఎం. రైస్ మిల్లు, గాయత్రి రైస్ మిల్లులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు, మండల తహసిల్దార్ పుష్పలతతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి సేకరించిన నాణ్యమైన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం రైస్ మిల్లులకు తరలిస్తున్నట్లు తెలిపారు. రైస్ మిల్లుల నిర్వాహకులు CMR ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారుల సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.
లక్షెట్టిపేట మండల కేంద్రంలోని శ్రీరామ రైస్ మిల్లును కూడా సందర్శించి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అనంతరం దండేపల్లి మండలంలోని జై యోగేశ్వర రైస్ మిల్లు, దండేపల్లి, కొర్విచెల్మ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను మండల తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే, ఎంపీడీఓ ప్రసాద్‌లతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
కొనుగోలు ప్రక్రియను ఎలాంటి అవాంతరాలు లేకుండా పారదర్శకంగా, వేగంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు త్రాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు, గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యాన్ని గోదాములలో నిల్వ చేయాలని, ధాన్యం నిల్వ, తరలింపులో ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.
ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి అనుగుణంగా ధాన్యం ప్రక్రియను వేగవంతం చేయాలని, లక్ష్యాలను త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.












