రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సీసీసీ నస్పూర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. రాంగ్రూట్లో వచ్చిన ఆటోను టిప్పర్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద స్థలాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పరిశీలించి, అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్, సీసీసీ నస్పూర్ జాతీయ రహదారిపై ఈరోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్, ఏసీపీ ఆర్.ప్రకాష్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద స్థలంలోని రహదారి పరిస్థితులు, డివైడర్ తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమైన సంఘటన అని అన్నారు. అందుబాటులో ఉన్న సీసీటీవీ దృశ్యాలను ప్రాథమికంగా పరిశీలించిన మేరకు, ఆటో రాంగ్రూట్లో ప్రయాణిస్తూ ఎదురుగా వచ్చిన టిప్పర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందని తెలిపారు.
ఈ ప్రమాదంలో ఇప్పటికే ముగ్గురు మృతి చెందడం అత్యంత విషాదకరమని, మృతుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని తెలిపారు. వారు తమ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని తెలిపారు. ప్రమాద స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించామని తెలిపారు. రహదారి మధ్యలోని డివైడర్‌లో ఉన్న ఖాళీ ద్వారా వాహనాలు అక్రమంగా మలుపు తిరిగే అవకాశం ఉన్నట్లు గుర్తించామని సీపీ తెలిపారు. ఈ ప్రాంతాన్ని ప్రమాదకర ప్రాంతంగా గుర్తించి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. రహదారిపై అవసరమైన నిర్మాణాత్మక మార్పులు చేయడం, డివైడర్‌లోని ఖాళీని మూసివేయడం, ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించిన చర్యలు చేపట్టడం వంటి అంశాలపై సంబంధిత శాఖలకు ప్రతిపాదనలు పంపించి, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారికి అవసరమైన అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిలో కొంతమందిని ఇప్పటికే కరీంనగర్‌కు తరలించామని, మరికొందరు మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. గాయపడిన వారిని పరామర్శించి, వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా అవసరమైన సహకారం అందిస్తున్నామని తెలిపారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందేలా స్థానిక కలెక్టర్‌తో కూడా మాట్లాడి సమన్వయం చేస్తున్నామని సీపీ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, అవసరమైన ఇంజినీరింగ్ చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.












