ఎన్నికల కమిషన్ బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తోందని, సర్వీస్ ఓటర్ల జాబితాలో 13 కోట్ల ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఎన్నికల కమిషన్ మోడీ, అమిత్ షా కనుసన్నల్లో పనిచేస్తోందని, సర్వీస్ ఓటర్ల జాబితాలో 13 కోట్ల ఓట్లు తొలగింపునకు కుట్ర జరుగుతోందని, అధికారం కోసం బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఏఐసీసీ, టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ఎన్నికల కమిషన్ తీరుకు నిరసనగా సోమవారం రోజున కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు గారు వారి దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ... గతంలో పలుమార్లు అడ్డదారుల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఈసారి సర్వీస్ ఓటర్ల జాబితాలో తమకు అనుకూలంగా లేని ప్రాంతాల్లో ఓట్ల తొలగింపునకు కుట్ర చేస్తోందని ఆయన అన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ విషయమై ఎన్నికల కమిషన్ తీరును ఎన్నోసార్లు ప్రస్తావించినప్పటికీ, కమిషన్ పనితీరులో మార్పు రాలేదని ఆయన అన్నారు. స్వయంగా ఎన్నికల చీఫ్ కమిషనర్ వ్యవహార శైలి గురించి తోటి కమిషనర్లు వెల్లడించడంతో రాహుల్ గాంధీ విమర్శలు నిజమైనవని దేశం గుర్తించిందని ఆయన అన్నారు.
ఎన్నికల చీఫ్ కమిషనర్ చర్యల వల్ల దేశంలో 13 కోట్ల ఓట్లు గల్లంతయ్యే పరిస్థితి నెలకొందని ప్రభుత్వ విప్ విజయరమణ రావు విమర్శించారు. ఎన్నికల చీఫ్ కమిషనర్ ఇప్పటికైనా విధుల్లోంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఉండి బీజేపీ అగ్రనేతల అడుగులకు మడుగులొత్తడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని, దేశ ప్రజలంతా ఆయన చేష్టలను అసహ్యించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్షాలు అంతా గళం విప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా సర్వీస్ ఓటర్ల జాబితాపై చీఫ్ కమిషనర్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతిని ప్రభుత్వ విప్ విజయరమణ రావు గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లు మరియు వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, డైరెక్టర్లు, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు మరియు పట్టణ కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచ్లు మరియు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.










