రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు, మత్తు పదార్థాల దుష్పరిణామాలపై యువతకు అవగాహన కల్పించేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో తాళ్ల గురజాల గ్రామంలో 'అరైవ్-అలైవ్' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా యువతకు పలు సూచనలు చేశారు.
బెల్లంపల్లి రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సభలో, రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్, సీటు బెల్ట్ వాడకం వంటి అంశాలపై వివరించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను వివరించి, వాటికి దూరంగా ఉండాలని సూచించారు.
ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, రోడ్డు భద్రతతో పాటు వ్యక్తిగత క్రమశిక్షణ కూడా ముఖ్యమని నొక్కి చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్ వంటివి ప్రమాదాలకు దారితీస్తాయని, ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలని సూచించారు.
మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడానికి పోలీసులు కృషి చేస్తున్నారని, సమాచారం తెలిస్తే వెంటనే డయల్-100కు తెలియజేయాలని కోరారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం, మైనర్ డ్రైవింగ్‌ను ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని, తల్లిదండ్రులు, వాహన యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యువత క్రమశిక్షణతో, స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ప్రమాదాల నివారణకు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.












