మంచేరియల్, జూన్ 29, 2026
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను పరిష్కరించడంపై అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం ఆయన అదనపు కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారితో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 48 దరఖాస్తులు అందాయని ఆయన పేర్కొన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్ లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన రామటెంకి రాజమల్లు తన తండ్రి నుంచి ఆధీనంలో ఉన్న ఇల్లు, పెరడును కొంతమంది అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నారని, ఈ విషయమై తగు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మందమర్రి మండలం రామకృష్ణాపూర్ ప్రాంత వాసులు గుడిపేటలోని కేంద్రీయ విద్యాలయంకు వెళ్లే ఆర్.టి.సి. బస్సు సేవలను రామకృష్ణాపూర్ వరకు పొడిగింపు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మందమర్రి మండల కేంద్రానికి చెందిన గొర్రె శ్రీనివాస్ తనకు లొంగిపోయిన మావోయిస్టుల కోటాలో కేటాయించిన స్థలం కబ్జాకు గురైనందున తగు చర్యలు తీసుకొని భూమిని తిరిగి ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కోటపల్లి మండలం పంగిడిసోమారం గ్రామానికి చెందిన బోయిని లచ్చయ్య తన భూమిని అక్రమంగా పట్టా చేయించుకుని బెదిరింపులకు గురి చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి గ్రామానికి చెందిన కాడం బీరయ్య తమ గ్రామంలోని కురుమ గూడెంలో మురుగు కాలువలు మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కోటపల్లి మండలం సర్వాయిపేట గ్రామానికి చెందిన ఉప్పరి ఆశ్రిత తనకు సాంఘిక సంక్షేమ బాలికల డిగ్రీ కళాశాలలో సీటు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మందమర్రి మండలం రామకృష్ణాపూర్ లోని వల్లభాయినగర్ కు చెందిన వెల్దండి మల్లేశ్వరి తన భర్త మరణించినందున ఆయన పేరిట ఉన్న పింఛన్ తన పేరిట మార్చి ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో 48 దరఖాస్తులు అందాయని, ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించే విధంగా సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.











