మంచేరియల్, 2026-07-11
రాష్ట్రంలో భూముల రీసర్వే కార్యక్రమాన్ని పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించి, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో భూముల రీసర్వే కార్యక్రమాన్ని పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించి, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
శనివారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి రాష్ట్ర మంత్రి, హైదరాబాదు నుండి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, గృహ నిర్మాణ శాఖ ఎం.డి. వి.పి. గౌతమ్, సెర్ప్ సి.ఈ.ఓ. దివ్య దేవరాజన్ లతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూముల సర్వే, రీసర్వే కార్యక్రమం అమలు, పురోగతి, చేపట్టాల్సిన కార్యాచరణ, భూ భారతి, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్లు, రెండు పడక గదుల ఇండ్ల పంపిణీ, విద్యార్థుల యూనిఫాంల పంపిణీ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో రెవెన్యూ మ్యాపులు అందుబాటులో లేని గ్రామాలకు శాశ్వత భూ రికార్డుల రూపకల్పన లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన 70 గ్రామాలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, జి.పి.ఎస్. ఆధారిత సర్వే పరికరాలు, డిజిటల్ మ్యాపింగ్ విధానాలను వినియోగిస్తూ రీసర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ ప్రక్రియలో ప్రతి దశలో పారదర్శకత, ఖచ్చితత్వం పాటించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించాలని, అవసరమైన చోట తక్షణ నిర్ణయాలు తీసుకుని ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. గ్రామస్థులకు సర్వేపై పూర్తి అవగాహన కల్పించి, వారి అభ్యంతరాలు, సందేహాలను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
సమగ్ర సర్వే పూర్తయిన అనంతరం రాష్ట్రంలో భూ రికార్డులు మరింత ఖచ్చితత్వంతో సిద్ధమవడంతో భూ వివాదాల పరిష్కారం సులభతరం అవుతుందని తెలిపారు. పెండింగ్లో ఉన్న సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి కారణాలను గుర్తించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూ భారతిలో భూ రీ-సర్వే కొరకు శిక్షణ పొందిన 5,700 మంది లైసెన్స్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని, రెగ్యులర్ సర్వేయర్లు, లైసెన్స్ సర్వేయర్లు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
పైలట్ ప్రాజెక్టుగా నక్షాలు లేని 413 ప్రాంతాలలో చేపట్టిన రీ-సర్వేతో 95 శాతం వరకు భూ సమస్యలు పరిష్కరించడం జరిగిందని తెలిపారు. సాదాబైనామా దరఖాస్తులను నిబంధనల మేరకు పరిష్కరించి, అర్హులైన వారికి నోటీసులు త్వరితగతిన జారీ చేయాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, భూముల రీ సర్వే, భూభారతి, సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్లు ఇతర ప్రభుత్వ పథకాల అమలులో నిబంధనల ప్రకారం అధికారుల సమన్వయంతో పని చేస్తున్నామని తెలిపారు.











