మంచేరియల్, 2026-07-22
పెద్దపల్లి పట్టణంలో మహిళా పోలీస్ స్టేషన్ వెయిటింగ్ హాల్, మున్సిపల్ కార్యాలయంలో కొత్త జేసీబీ వాహనాన్ని గౌరవ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు ప్రారంభించారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు మొత్తం రూ. 72 లక్షలు ఖర్చయ్యాయి.
పెద్దపల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లోని మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో రూ. 29 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన వెయిటింగ్ హాల్ ను, అలాగే పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో రూ. 43 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన జేసీబీ వాహనాన్ని గౌరవ ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు స్థానిక నాయకులు, పోలీస్ అధికారులతో కలిసి ప్రారంభించారు.
అనంతరం మున్సిపల్ కార్యాలయంలో మొక్కలు నాటడంతో పాటు, మున్సిపల్ ఆవరణలో ఏర్పాటు చేసిన వర్షపు నీటి ఇంకుడు గుంతను కూడా ప్రారంభించారు. రాబోయే రోజుల్లో పెద్దపల్లి మున్సిపల్లో దశలవారీగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
గతంలో మున్సిపల్ పరిధిలో ఏవైనా కార్యక్రమాలు చేపట్టాలంటే జేసీబీని అద్దెకు తెచ్చుకోవాల్సి వచ్చేదని, ఆ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ కు స్వంతంగా రూ. 43 లక్షలతో జేసీబీని కొనుగోలు చేసి ప్రారంభించుకున్నామని ఆయన వివరించారు. మహిళా పోలీస్ స్టేషన్ కు పెద్దపల్లి జిల్లాలోని 14 మండలాల, 4 మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నుండి బాధితులు పెద్ద సంఖ్యలో వస్తుంటారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీపీ, పోలీస్ బృందం ఆలోచన మేరకు రూ. 29 లక్షలతో షెడ్ నిర్మాణం చేపట్టామని తెలిపారు.
పెద్దపల్లి పట్టణంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రాబోయే సంవత్సర కాలంలో ప్రభుత్వ ఆసుపత్రి, బస్సు డిపో, కోర్టు, బైపాస్ రోడ్డు పనులు కూడా పూర్తి కానున్నాయని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ ట్యాంకుల నిర్మాణం, తాగునీటి సమస్య నివారణకు పైపులైన్ల ఏర్పాటు వంటి పనులు కూడా జరుగుతున్నాయని, ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.










