మంచేరియల్, 2026-07-18
రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయిన వారికి ఆయన కృత్రిమ అవయవాలను అందించారు. అనంతరం, బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంపీ తీవ్ర విమర్శలు గుప్పించారు.
రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు కళావతి, సెక్రటరీ జయప్రద, ప్రతినిధులు మల్లికార్జున్, రాజేందర్ తదితరులు ఘన స్వాగతం పలికి సన్మానించారు.
వివిధ ప్రమాదాల్లో కాళ్లు, చేతులు కోల్పోయిన నిరాశ్రయులకు ఎంపీ వంశీకృష్ణ కృత్రిమ అవయవాలను అందించారు. కళావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన లయన్స్ క్లబ్ ప్రతినిధులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని విమర్శించారు. దివంగత కాకా వెంకటస్వామి కలలుగన్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాకుండా, కమిషన్ల కోసమే కల్వకుంట్ల కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ప్రజల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంపై సోషల్ మీడియా ద్వారా వ్యతిరేకత వస్తోందని, కాళేశ్వరం కాదు కూలేశ్వరమని ప్రజలే వీడియోలు తీసి వివరిస్తున్నారని పేర్కొన్నారు. 8000 మెగావాట్ల విద్యుత్‌ను వృధా చేస్తూ ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని ప్రజలే చెబుతున్నారని తెలిపారు. ఒక సంవత్సరం ప్రాజెక్టును తమకు అప్పగిస్తే లోపాలను సరిచేస్తామని చెప్పడంలోనే, ఇంకా మిగిలిన కమిషన్ల కోసం ఆశ పడుతున్నారని అర్థమవుతోందని అన్నారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వ పక్షాన కృషి చేసి, గ్రావిటీ ద్వారా నీటి కరువు లేకుండా రైతాంగానికి సాగునీరు అందిస్తామని వంశీకృష్ణ హామీ ఇచ్చారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ ఆసుపత్రులకు వచ్చి వెళ్తున్నారంటే ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణలోని నిరుద్యోగుల కోసం మంత్రి వివేక్ వెంకటస్వామి చేస్తున్న కృషిని జీర్ణించుకోలేక కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, 25 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివేక్ వెంకటస్వామి కృషి చేస్తున్నారని తెలిపారు. తిన్నది అరగక కేటీఆర్ చేస్తున్న విమర్శలను ఖండిస్తున్నామని, తెలంగాణ యువతను తప్పుదారి పట్టించవద్దని కేటీఆర్‌కు సూచిస్తున్నామని అన్నారు.
మరోవైపు, కేంద్రంలో బీజేపీ పార్టీ పేపర్ స్కామ్ చేస్తూ విద్యార్థుల ప్రశ్నాపత్రాలను అమ్ముకొని బ్రతికేందుకు చూస్తోందని విమర్శించారు. జై శ్రీరామ్ అంటూ అయోధ్య రాముడికి చెందిన సొమ్మును దొంగలించిన బీజేపీ నాయకులు ప్రధాని మోడీ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేయడం చాలా తప్పు అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజాపాలనను సజావుగా కొనసాగేలా సహకరించాలని, కేటీఆర్ కుట్రలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.









