మంచేరియల్, July 9, 2026
గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధికి సర్పంచ్‌లు స్థానిక అవసరాలను గుర్తించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. గురువారం క్యాతనపల్లి పరిధిలోని అమ్మ గార్డెన్స్‌లో జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ఈమేరకు దిశానిర్దేశం చేశారు. గ్రామస్థాయి అభివృద్ధిలో సర్పంచ్‌లు, వార్డు సభ్యుల భాగస్వామ్యం కీలకమని తెలిపారు.
గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధికి సర్పంచ్‌లు స్థానిక అవసరాలను గుర్తించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. గురువారం జిల్లాలోని క్యాతనపల్లి పరిధిలోని అమ్మ గార్డెన్స్‌లో గ్రామ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో సర్పంచ్‌లు, వార్డు సభ్యుల భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలిపారు.
గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అందుబాటులో ఉన్న వనరులతో, నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. గ్రామ పంచాయతీలకు లభించే 15వ, 16వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, సాధారణ నిధులు, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, వి బి జి రామ్ జీ పథకం తదితర వనరులను సమర్థవంతంగా వినియోగించి గ్రామాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.
గ్రామాల్లో పెరుగుతున్న వీధి కుక్కల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు జంతు పునరుత్పత్తి నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పశువైద్య శాఖ ద్వారా శస్త్రచికిత్సలు, యాంటీ రేబిస్ టీకాలు ఉచితంగా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలు కుక్కలను పట్టుకోవడం, సంరక్షణ వంటి అంశాలపై దృష్టి సారించి సమస్య పరిష్కరించాలని సూచించారు.
మురుగునీటి వ్యవస్థలు, ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ హాళ్లు, త్రాగునీటి సరఫరా, సౌర విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి పనులకు ప్రభుత్వ పథకాలలో ప్రత్యేక నిధులు అందుబాటులో ఉన్నాయని, ఆయా పథకాల మార్గదర్శకాల ప్రకారం ప్రతిపాదనలు రూపొందించి అమలు చేయాలని తెలిపారు. ఉపాధి హామీ, వి బి జి రామ్ జీ పథకాల కింద చేపట్టిన పనులకు చెల్లింపులు నిర్ణీత గడువులో జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, పనులు పూర్తయిన వెంటనే బిల్లులు, యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సకాలంలో సమర్పించాలని సూచించారు.
గ్రామ పంచాయతీ నిధులను ప్రజా ప్రయోజనాల కోసమే వినియోగించాలని, నిధుల దుర్వినియోగం, మళ్లింపు జరిగినట్లయితే సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం, మహిళా సంఘాల భవనాలు, ఇతర ప్రాధాన్యత కలిగిన మౌలిక వసతుల నిర్మాణానికి అవసరమైన భూమి, పరిపాలనా అనుమతులు జిల్లా యంత్రాంగం నుంచి అందజేస్తామని తెలిపారు.
ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. 5 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు కూరగాయల సాగు కోసం పందిళ్ల ఏర్పాటు, బీటీ రహదారులు, మ్యాజిక్ డ్రైన్లు, సౌర విద్యుత్ ఆధారిత వీధి దీపాలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాలలో చేపట్టే అవకాశం ఉందని తెలిపారు. జిల్లా యంత్రాంగం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని, అభివృద్ధి కార్యక్రమాల్లో సర్పంచ్‌లు చొరవ తీసుకుని గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని కోరారు.








