మంచేరియల్, జూలై 9, 2026
జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ప్రజలకు అందించిన ఎన్యుమరేషన్ ఫారాల సేకరణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. గురువారం మంచిర్యాలలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగే ప్రక్రియలో రాజకీయ పార్టీలు, బూత్ స్థాయి ఏజెంట్లు సహకరించాలని కోరారు.
జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ప్రజలకు అందించిన ఎన్యుమరేషన్ ఫారాల సేకరణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావులతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 24వ తేదీ వరకు చేపట్టనున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో రాజకీయ పార్టీలు భాగస్వాములు కావాలని, బూత్ స్థాయి అధికారులు ఓటర్లకు అందించిన ఎన్యుమరేషన్ ఫారాల సేకరణలో అధికారులకు సహకరించాలని తెలిపారు. ఓటరు ఎన్యుమరేషన్ ఫారం నింపడంలో రాజకీయ పార్టీలచే నియమించబడిన బూత్ స్థాయి ఏజెంట్లు సహకరించాలని, నింపిన ఫారాలను సేకరించడంలో బూత్ స్థాయి అధికారులతో కలిసి పని చేయాలని సూచించారు. నింపిన ఫారాలలోని వివరాలను బూత్ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు బి.ఎల్.ఓ. యాప్ లో నమోదు చేస్తారని తెలిపారు. అర్హత గల ఓటర్లు స్వయంగా ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేసుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా బూత్ స్థాయి ఏజెంట్లు సహకరించాలని, తమ బూత్ స్థాయి ఏజెంట్లు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.








