మంచేరియల్, 2026-07-09
ప్రభుత్వ అధికారులు, సిబ్బంది విధుల్లో సమయపాలన పాటించాలని, కార్యాలయాలకు వచ్చే ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. గురువారం బెల్లంపల్లి మండలం తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తమ విధుల్లో సమయపాలన పాటించాలని, కార్యాలయాలకు వచ్చే ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం బెల్లంపల్లి మండలం తహసిల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు పట్టికలు, కార్యాలయ రికార్డులు, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వివరాల నమోదు అంశాలను పరిశీలించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని, ఈ నెల 24వ తేదీ లోగా పూర్తి చేసేలా పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఓటర్ల నుంచి సేకరించిన ఎన్యుమరేషన్ ఫారాల్లోని సమాచారాన్ని బి.ఎల్.ఓ. యాప్‌లో స్పష్టంగా నమోదు చేయాలన్నారు. వివిధ ధ్రువపత్రాల కోసం అందిన దరఖాస్తులను నిబంధనలకు లోబడి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.
సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి, సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి భూభారతి పెండేసి వివరాలను పరిశీలించారు. వివిధ భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులలో అందిన దరఖాస్తులను రికార్డులతో సరిచూసి, క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.
అనంతరం నెన్నెల మండలం ఆవడం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మండల తహసిల్దార్ శ్రీనివాస్‌తో కలిసి సందర్శించి, తరగతి గదులు, మధ్యాహ్న భోజనం పథకం అమలు, సైన్స్ వేర్ నిర్వహణ, రిజిస్టర్లను పరిశీలించారు.
ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్, విద్యార్థిని, విద్యార్థులకు వేరువేరుగా మూత్రశాలలు, భోజనశాల, అదనపు గదులు, ప్రహరీ గోడ వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
మంచిర్యాల జిల్లా విద్యారంగంలో దేశంలో, రాష్ట్రంలో ఉన్నత స్థానాల్లో నిలిచిందని, దాదాపు 320 మంది ఉపాధ్యాయులను నియమించామని, అడ్మిషన్లలో జిల్లా మొదటి స్థానంలో ఉందని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య 3 శాతం పెరిగిందని, 75 శాతం హాజరు నమోదవుతోందని పేర్కొన్నారు.
జిల్లాలో 700లకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 44 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో సకల సౌకర్యాలతో విద్య అందిస్తున్నారని తెలిపారు. విద్యారంగంలో 150 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, ఇందులో సీఎస్ఆర్ 80 కోట్లు, ఈజీఎస్ 20 కోట్లు, సమగ్ర శిక్ష 11 కోట్లు, నాబార్డు 6 కోట్లు, ప్రధానమంత్రి జన్ మన్ 3 కోట్లు, ప్రధానమంత్రి జుగా 3 కోట్లు, ప్రభుత్వ నిధులతో పాఠశాలల అభివృద్ధి చర్యలు చేపట్టామని వివరించారు.








