జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఆదేశించారు.
గురువారం మంచిర్యాల రాజస్వ మండలాధికారి కార్యాలయం, బెల్లంపల్లి తహసిల్దార్ కార్యాలయాలను ఆయన సందర్శించి, ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం, భూభారతి పెండింగ్ దరఖాస్తులు, భూ సేకరణ సంబంధిత అంశాలపై కార్యాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.
ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు.
సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని సిబ్బందికి సూచించారు. భూభారతి పోర్టల్ ద్వారా నిబంధనల ప్రకారం భూ సంబంధిత సర్వీసులను వేగవంతంగా అమలు చేయాలని, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని తెలిపారు. భూ సేకరణ ప్రక్రియలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం విషయంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.
కార్యాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని, కార్యాలయానికి వచ్చే ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని, సర్టిఫికెట్లను నిబంధనలకు లోబడి నిర్ణీత గడువులోగా జారీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.











