రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా పర్యటన నేపథ్యంలో మంచిర్యాల జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లను చేపడుతోంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం వివిధ ప్రాంతాలలో పర్యటించి, పర్యటన కార్యక్రమాల అమలుకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు.
జూన్ 13వ తేదీన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దండేపల్లి మండలం శ్రీ గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి, మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మంచిర్యాల పట్టణంలో సింగరేణి ఉద్యోగుల కుటుంబ సభ్యులకు నియామక పత్రాలను అందజేస్తారు.
సాయంత్రం శ్రీరాంపూర్ ఏరియాలో ఓపెన్ కాస్ట్ గనులను పరిశీలించి, శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ కుమార్ దీపక్, డి.సి.పి. ఎ.భాస్కర్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, తదితరులతో కలిసి గూడెం ఆలయాన్ని సందర్శించారు. పద్మావతి ఫంక్షన్ హాల్, పద్మనాయక ఫంక్షన్ హాల్ లలో ఏర్పాట్లను కూడా పరిశీలించి, అధికారులకు సూచనలు అందించారు.
ఉప ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

