ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీఐటీయూ మద్దతు ప్రకటించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు.
మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం స్పందించకపోవడంతోనే కార్మికులు సమ్మె చేస్తున్నారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటారు వాహనాల చట్టం-2019, విద్యుత్ బస్సుల విధానం ఆర్టీసీలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని, దీనివల్ల ఆర్టీసీలు కనుమరుగై, ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలు మాత్రమే మిగిలే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ బస్సుల విధానం వల్ల ఆర్టీసీలకు ఎటువంటి పాత్ర ఉండదని, కేవలం డబ్బులు చెల్లించడం మాత్రమే బాధ్యతగా మారుతుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేయాలని, GCC పద్ధతిని రద్దు చేయాలని, ప్రైవేటు సంస్థలకు ఇస్తున్న సబ్సిడీలను ఆర్టీసీలకు ఇవ్వాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఆర్టీసీలే నేరుగా విద్యుత్ బస్సులు సమకూర్చుకునేందుకు అవకాశం కల్పించాలని, బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరింది. ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని, కార్మికుల ఉద్యోగ భద్రత కల్పించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం సమ్మె చేస్తున్న జేఏసీ నాయకులతో చర్చలు జరిపి, సమ్మె విరమణకు చర్యలు చేపట్టాలని దుంపల రంజిత్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సంకె రవి, జిల్లా సహాయ కార్యదర్శి సాంబారి వెంకటస్వామి, జిల్లా కమిటీ సభ్యులు గోమాస ప్రకాష్, మండల కన్వీనర్ పసుల తిరుపతి, చిందం వెంకటేష్, చిప్పకుర్తి కుమార్, బానేష్ తదితరులు పాల్గొన్నారు.







