ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. అర్జీదారుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, న్యాయం చేయాలని ఆయన ఆదేశించారు.
సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల భవనంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, రాములు లతో కలిసి అర్జీదారుల నుండి నేరుగా దరఖాస్తులు స్వీకరించారు. భూ వివాదాలు, వారసత్వ ఆస్తుల సమస్యలు, ప్రభుత్వ రికార్డుల సవరణ, పెన్షన్ల మంజూరు, తల్లితండ్రుల పోషణ వంటి పలు రకాల సమస్యలపై అర్జీలు అందాయి.
నెన్నెల మండలం నార్వాయిపేట గ్రామానికి చెందిన కైరత్ పాషా, తాండూర్ మండలం బోయపల్లి గ్రామానికి చెందిన ఎలిగేటి సాయికుమార్, కన్నెపల్లి మండలం సాలిగాం గ్రామానికి చెందిన తాళ్లపల్లి నరేష్ వంటివారు తమ భూములకు సంబంధించిన అక్రమ మార్పిడి, అమ్మకాలపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.
మంచిర్యాల పట్టణానికి చెందిన సాయిని శ్రీనివాస్ భూ భారతి పోర్టల్ లో భూ వివరాల నవీకరణ, కొత్త మాధవి, కిరణ్ మానసిక దివ్యాంగులకు పెన్షన్, లింగన్నపేట సత్యనారాయణ వృద్ధాప్య పింఛన్, ఆవునూరి రాయలింగు భూమిని ప్రభుత్వ రికార్డులలో నమోదు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. దండేపల్లి మండల కేంద్రానికి చెందిన గుండా రవీందర్ కుమారుని నుండి నెలవారీ నగదు ఇప్పించాలని కోరారు.
ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత అధికారుల సమన్వయంతో సత్వర పరిష్కార చర్యలు చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి ఒక ముఖ్య వేదిక అని, దానిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.











