మంచేరియల్, జూలై 30
తెలంగాణ చరిత్రలో అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ రాబిన్ హుడ్, పోరాటయోధుడు పండుగ సాయన్న స్ఫూర్తిని భావితరాలకు చేరవేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. పండుగ సాయన్న జయంతి, వర్ధంతి తేదీల ఖరారుపై ఆయన ఆధ్వర్యంలో విస్తృత సమాలోచనలు జరిగాయి.
తెలంగాణ చరిత్రలో అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ రాబిన్ హుడ్, పోరాటయోధుడు పండుగ సాయన్న స్ఫూర్తిని భావితరాలకు చేరవేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
పండుగ సాయన్న జయంతి, వర్ధంతి తేదీల ఖరారుపై మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో సమాలోచనలు నిర్వహించారు. ఈ సమావేశంలో పండుగ సాయన్నపై పుస్తకాలు రచించిన బెక్క జనార్దన్, ఇందిరా దేవి, కుటుంబ సభ్యులు పండుగ నర్సిములు, చెన్నయ్య, రాష్ట్ర ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, పండుగ సాయన్న సేవా సమితి అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్, ముదిరాజ్ సంక్షేమ సంఘం నాయకులు ప్రభాకర్, బీసీ వెల్ఫేర్ రిటైర్డ్ ఉద్యోగి శ్రీనివాస్ తదితరులతో సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పండుగ సాయన్న పోరాటం, త్యాగం, సామాజిక న్యాయం కోసం చేసిన కృషి నేటి యువతకు తెలియాలంటే చారిత్రక ఆధారాలు, పురావస్తు శాఖ ధ్రువీకరణ వంటి ప్రామాణిక సాక్ష్యాలు అవసరమన్నారు. అందుకోసం పురావస్తు శాఖ వద్ద అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా పండుగ సాయన్న జయంతి, వర్ధంతి తేదీలను నిర్ధారించే ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సూచించారు.
రాష్ట్ర ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నేతృత్వంలో సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని మంత్రి ఆదేశించారు. ఆ నివేదిక అందిన అనంతరం ప్రభుత్వం అధికారికంగా పరిశీలించి పండుగ సాయన్న జయంతి, వర్ధంతులపై అధికారిక ప్రకటన చేస్తుందని స్పష్టం చేశారు.
పండుగ సాయన్న సేవలను ప్రభుత్వ స్థాయిలో గుర్తించి, ఆయన జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వం తరఫున అన్ని విధాలా కృషి చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. పండుగ సాయన్న చరిత్ర, పోరాట వారసత్వాన్ని పరిరక్షించడం ద్వారా భావితరాలకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి తెలిపారు.












