కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సోమవారం చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించారు. కోటపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన, ఇటీవల మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కోటపల్లి మండలంలో 60 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. లింగన్నపేట, యెదులబంధం, రొయ్యలపల్లి, అలుగామ, జనగామ గ్రామాల్లో ఈ పనులు చేపట్టనున్నారు.
వెంచపెల్లి గ్రామానికి చెందిన పబ్బా అజయ్ గౌడ్ ఇటీవల ప్రాణహిత నదిలో కొట్టుకుపోయి మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని మంత్రి పరామర్శించి, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
యెదులబంధం ఎంపీపీ పాఠశాలను సందర్శించిన మంత్రి, పాఠశాలకు కాంపౌండ్ వాల్, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన తెలిపారు.
ప్రభుత్వ పథకాల అమలుపై మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరాయంగా కార్డులు పంపిణీ చేస్తోందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేదలకు సంతోషాన్నిస్తోందని అన్నారు. అయితే, మిషన్ భగీరథ ప్రాజెక్ట్ విఫలమైందని విమర్శించారు.











