ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమవారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో ఆయన అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్, ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై అర్జీలు అందాయి.
చెన్నూరు పట్టణానికి చెందిన లింగ కృష్ణ హమాలీల అధిక ధరల వసూళ్లపై, మంచిర్యాల పట్టణానికి చెందిన దోమల చంద్రశేఖర్ విద్యార్థినిని వసతి గృహానికి బదిలీ చేయడంపై దరఖాస్తు చేసుకున్నారు. నెన్నెల మండలం కోనంపేట గ్రామ రైతులు బోర్లకు విద్యుత్ కనెక్షన్, మంచిర్యాల ఎన్ టి ఆర్ నగర్ కు చెందిన చిలుక పద్మ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు.
బెల్లంపల్లికి చెందిన మాగంటి సౌభాగ్యవతి భూభారతి పోర్టల్ లో పాస్ పుస్తకం వివరాల సవరణ, మందమర్రి మండలం అమరవాదికి చెందిన తోటపల్లి లత జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద ఆర్థిక సహాయం, గద్దెరాగడి ప్రాంతానికి చెందిన గొట్టే నరేందర్ మట్టి తవ్వకాలపై విచారణ, జన్నారం మండలం రేండ్లగూడ గ్రామ సముద్రాల శంకర్ చెరువులపై ఆక్రమణల తొలగింపుపై దరఖాస్తులు సమర్పించారు.
అనంతరం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమం గోడ ప్రతులను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ నెల 29, 30 తేదీలలో ఇంటింటికీ పోలియో చుక్కలు వేస్తామని, 0-5 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సిన్ అందిస్తామని, జిల్లా వ్యాప్తంగా 1,836 మంది సిబ్బంది 459 బూత్ ల ద్వారా కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకుంటామని, జిల్లాను పోలియో రహిత, ఆరోగ్య మంచిర్యాలగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ పేర్కొన్నారు.











