ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, మంచిర్యాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమ పరిశీలకులు ఆర్.దశరథ్ ఆదేశించారు. బుధవారం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు.
జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్షలో, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, ప్రత్యేక ఉప పాలనాధికారి చంద్రకళ లతో పాటు అన్ని మండలాల తహసిల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో మ్యాపింగ్ శాతాన్ని పెంచడం అత్యవసరమని దశరథ్ స్పష్టం చేశారు.
అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన 2002 ఓటర్ల జాబితాలు https://ceotelangana.nic.in, https://voters.eci.gov.in లలో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులు తమ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తాము నమోదు చేయబడిన పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బూత్ స్థాయి అధికారులను సంప్రదించి, 2002 ఓటర్ల జాబితాలో ఎన్నికల మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఫారం 6, 7, 8 ద్వారా అందిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి, త్వరగా పరిష్కరించాలని, మరణించిన, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాలను గుర్తించి, ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి తొలగించాలని లేదా సవరించాలని ఆదేశించారు. ఒకే నియోజకవర్గంలో చిరునామా మార్చుకున్న ఓటర్లకు నోటీసులు జారీ చేసి, సరైన చిరునామాలో ఓటు నమోదు చేయాలని, ఇతర నియోజకవర్గాలకు మారిన ఓటర్లను ప్రస్తుత జాబితా నుండి తొలగించాలని తెలిపారు. జిల్లాలో డబుల్ ఓటర్లను గుర్తించి తొలగించాలని, ప్రజలలో అవగాహన కల్పించేందుకు దినపత్రికలు, స్థానిక ఛానళ్లలో స్క్రోలింగ్ నిర్వహించాలని సూచించారు.











