ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని మహిళలు అన్ని రంగాలలో రాణించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెర్ప్ సమావేశంలో ఆయన స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను విస్తరించాలని సూచించారు. పెట్రోల్ బంకులు, డెయిరీలు, సోలార్ పవర్ ప్లాంట్లు, స్టిచింగ్, ప్లంబింగ్ వంటి రంగాల్లో మహిళలు ముందుకు రావాలని ఆయన ప్రోత్సహించారు.
మహిళల సామర్థ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం 100 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని, సహాయక సంఘాల మహిళలు ఇందులో పాల్గొని సర్టిఫికెట్ పొందిన అనంతరం వారి నైపుణ్యాల ఆధారంగా ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని కలెక్టర్ వివరించారు. మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న రంగాలను గుర్తించి కార్యకలాపాలను విస్తరించాలని సూచించారు.
జిల్లా కేంద్రంలో నిర్మించిన మహిళా శక్తి భవన్‌ను శిక్షణ కార్యక్రమాలకు వినియోగించుకోవాలని, ప్యాడీ కమిషన్‌లో సుమారు 65 శాతం స్వయం సహాయక సంఘాలకు చేరిందని తెలిపారు. రైతుల అవసరాలను గుర్తించి, వచ్చే పంట సీజన్‌కు అవసరమైన విత్తనాల ఎంపికలో స్వయం సహాయక సంఘాల సభ్యులు భాగస్వామ్యం కావాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధి పొందడంతో పాటు, మెషిన్, సెంట్రింగ్, సిమెంట్ ఇటుక యూనిట్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వీటికి ఇందిరా మహిళా శక్తి పథకం, పి ఎం ఎఫ్ ఎం ఈ ద్వారా ఆర్థిక సహాయం, శిక్షణ అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.











