బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, సత్వర న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కల్పించాలని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ పోలీసు సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఆయన, అక్కడి పరిస్థితులను సమీక్షించి పలు కీలక సూచనలు చేశారు.
మంచిర్యాల జోన్ పరిధిలోని సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన డీసీపీ ఏ. భాస్కర్, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. రిసెప్షన్, సీసీటీఎన్ఎస్ సిబ్బందితో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ నిర్వహణకు సంబంధించిన రికార్డులు, రౌడీ షీటర్లు, అనుమానితుల వివరాలు, పెండింగ్‌లో ఉన్న కేసుల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్, వాహనాల తనిఖీలు ముమ్మరం చేసి, విజిబుల్ పోలీసింగ్‌ను చేపట్టాలని డీసీపీ సూచించారు. ప్రతి కానిస్టేబుల్ తమకు కేటాయించిన కాలనీలు, గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి, ప్రజలతో, యువతతో మాట్లాడి శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలను గుర్తించి, పరిష్కరించాలని సూచించారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించే దిశగా అధికారులు కృషి చేయాలని ఆయన తెలిపారు.
ప్రజల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు. ట్రాఫిక్ నిబంధనలపై విస్తృతంగా ప్రచారం చేసి, ప్రతి ఒక్కరూ వాటిని తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిఘా కట్టుదిట్టం చేయాలని సూచించారు.
కళాశాలలు, పాఠశాలల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని డీసీపీ అధికారులు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ తనిఖీల్లో మంచిర్యాల రూరల్ సీఐ రవీందర్, ఎస్ఐ ప్రశాంత్ పాల్గొన్నారు.








