మహిళల రక్షణ, భద్రతకు షీటీమ్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఈ దిశగా తమ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో షీటీమ్, ఏహెచ్టీయూ, భరోసా కేంద్రాల పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు.
సమీక్ష సందర్భంగా, పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, షీటీమ్ మహిళలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. పాఠశాలలు, కళాశాలలు, రద్దీగా ఉండే బస్టాండ్లు, ప్రధాన కూడళ్లలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు నిర్భయంగా షీటీమ్ నంబర్లకు లేదా డయల్ 100కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
భరోసా కేంద్రాలలో లీగల్ అడ్వైజర్, కౌన్సిలర్, వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని సీపీ ఆదేశించారు. లైంగిక వేధింపులకు గురైన మహిళలు, బాలికలకు సంబంధించిన కేసుల నమోదు నుంచి బాధితులకు అవసరమైన సహాయాన్ని అందిస్తూ, వారి మానసిక, విద్యాపరమైన పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని సూచించారు.
అలాగే, పిల్లల అశ్లీల వీడియోలు, అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలకు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేయడం లేదా డౌన్లోడ్ చేయడం ఐటీ చట్టంలోని సెక్షన్ 67(బి) ప్రకారం తీవ్రమైన నేరమని, ఈ విషయంలో ఎటువంటి ఉపేక్ష ఉండదని సీపీ స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ఇన్స్పెక్టర్ భీమేష్, పెద్దపల్లి ఏహెచ్టీయూ ఎస్ఐ శైలజ, మంచిర్యాల జోనల్ షీటీమ్ ఇన్చార్జ్ మహిళా ఎస్ఐ ఉషారాణి, భరోసా కేంద్రం, షీటీమ్ సిబ్బంది పాల్గొన్నారు.











