భారతదేశంలో పుట్టిన ప్రతి హిందువు మనోభావాలను గౌరవిస్తూ, జిల్లాలోని ప్రతి గ్రామం, పట్టణ ప్రాంతంలో గోశాలలకు ప్రభుత్వ స్థలం కేటాయించి, గోవుల రక్షణకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని గో సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ ప్రతినిధులు జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. గోవులను రక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
గోవులోనే సకల దేవతలు కొలువై ఉంటారని, గోమాతను తాము దైవంగా భావిస్తారని, గో సంరక్షణ తమ ధర్మంలో భాగమని, అది తమ జీవన విధానమని వారు తెలిపారు. నేడు వీధుల్లో అనాథలుగా, ఆకలితో అలమటిస్తూ, రోడ్డు ప్రమాదాలకు గురవుతూ తిరుగుతున్న గోవులను చూస్తుంటే హృదయం తరుక్కుపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని గో ప్రేమికులు కోరారు.
ప్రధాన డిమాండ్లు
గో ప్రేమికులు చేసిన ప్రధాన డిమాండ్లలో ప్రతి గ్రామంలో అనాథ గోవుల కోసం శాశ్వత గోశాల ఏర్పాటు చేయాలని, గోశాలల నిర్వహణకు ప్రభుత్వం నుండి నెలవారీ నిధులు, దాణా సదుపాయం కల్పించాలని కోరారు. అలాగే, ప్రతి దేవాలయంలో గోవును పూజించే సంప్రదాయాన్ని, గోశాల నిర్వహణను తప్పనిసరి చేయాలని, గోవధను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గోవు బాగుంటేనే రైతు బాగుంటాడని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని వారు తెలిపారు. గోమూత్రం, గోమయంతో భూమి సారవంతం అవుతుందని, తమ ఆరోగ్యం బాగుంటుందని వారు పేర్కొన్నారు. అందుకే గోవును రక్షించడం అంటే భూమాతను, భవిష్యత్ తరాలను రక్షించడమేనని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభారీ వేముల హరిప్రసాద్, మండల ప్రభారీ కర్ణ కంటి రవీందర్, నస్పూర్ మండల ప్రబారి బొమ్మని విద్యాసాగర్, గోరక్ష జిల్లా ప్రముఖ్ దూటరాజసమ్మయ్య, పాలమాకుల వెంకటరెడ్డితో పాటు పలువురు గో ప్రేమికులు పాల్గొన్నారు.

