మంచిర్యాల నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడకల ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక (లక్కీ డ్రా) కార్యక్రమం మంగళవారం జరిగింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని షాదీఖానా మైనారిటీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు.
పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా, న్యాయబద్ధంగా ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. లక్కీ డ్రా ద్వారా ఎంపికైన లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ లక్కీ డ్రా కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మంచిర్యాల రఫతూల్లా, మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ రాజుతో పాటు పలువురు సంబంధిత అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
రెండు పడకల గదుల పథకం ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పునరుద్ఘాటించారు. అర్హులైన వారందరికీ న్యాయం జరిగేలా చూస్తామని, పథకం అమలులో ఎలాంటి అవినీతికి తావులేకుండా పర్యవేక్షిస్తామని హామీ ఇచ్చారు.












