ఇంటింటికీ నిరంతర తాగునీటి సరఫరా లక్ష్యంగా చేపట్టిన అమృత్ 2.0 పనులను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అధికారులను ఆదేశించారు.
గురువారం, బెల్లంపల్లి పట్టణంలో అమృత్ 2.0 పథకం కింద జరుగుతున్న పనులను బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అమృత్ 2.0 పథకంలో భాగంగా చేపట్టిన తాగునీటి సరఫరా పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరా అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యమని, పనులలో ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార చర్యలపై ప్రజారోగ్య శాఖ అధికారులతో ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పనుల అమలులో సమన్వయం పెంచి, అవసరమైన యంత్రాంగం, సిబ్బందిని సమకూర్చి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పనులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, అమృత్ 2.0 పనుల కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.











