భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. గురువారం తాండూర్ మండలంలో జరిగిన శిక్షణా కార్యక్రమాలలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య తాండూర్ మండలంలో బూత్ స్థాయి ఏజెంట్ల శిక్షణ కార్యక్రమానికి హాజరై, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదు కావడంతో పాటు అనర్హుల పేర్లను నిబంధనల మేరకు తొలగించాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ స్థాయి ఏజెంట్లు ఓటరు జాబితా నాణ్యతను మెరుగుపరచడంలో భాగస్వాములు కావాలని కోరారు.
అనంతరం, ఆయన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ‘ప్రధానమంత్రి పోషణ్’ పథకం శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాల్సిన ఆవశ్యకతను వివరించారు. మధ్యాహ్న భోజన నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని, వంట కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
పాఠశాలల నిర్వహణ, విద్యార్థుల ప్రవేశాల పెంపు, విద్యా ప్రమాణాల మెరుగుదలపై ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ సూచించారు. గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రుల భాగస్వామ్యంతో పాఠశాల అభివృద్ధిని సామూహిక బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు.
చివరగా, తాండూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అదనపు మరుగుదొడ్డి నిర్మాణ పనులను ప్రారంభించి, పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.











